

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతుగా నిలిచారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దలేర్ మెహందీ మద్యం సేవించి ప్రదర్శన ఇస్తున్నారంటూ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైనే ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై స్పందించిన అనుపమ్ ఖేర్.. దలేర్ మెహందీ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, తనకు తెలిసినంత వరకు ఆయన మద్యం సేవించరని పేర్కొన్నారు. గత రెండు, మూడేళ్లుగా గాయకుడి ఆరోగ్యం కూడా బాగోలేదని, నిర్వాహకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమానికి హాజరై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి బాధ కలిగిందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఒక వ్యక్తి ప్రదర్శనపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, బహిరంగ వేదికపై అతడిని అవమానించడం సరికాదని అన్నారు. మంత్రి తన అసంతృప్తిని దలేర్ మెహందీతో వ్యక్తిగతంగా, గౌరవప్రదంగా చర్చించి ఉండాల్సిందని సూచించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనుపమ్ ఖేర్.. దలేర్ మెహందీకి ఎదురైన అనుభవం బాధాకరమని పేర్కొంటూ, మంత్రి తరఫున క్షమాపణలు కూడా చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!