

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో సందడి చేసిన ఆయన, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల(మార్చి) 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రాజకీయాలకే పూర్తిగా అంకితమవుతారా అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ, సురేందర్ రెడ్డితో మరో సినిమా చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. బాడీ పెంచి, స్టైలిష్ గడ్డంతో కొత్త లుక్లో కనిపిస్తున్నారు. అదే లుక్తో రాజకీయ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్, మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది(2027) సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఎవరు అన్నదానిపై గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఫౌజీ మూవీ ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయిల్ పేరు ఫిలింనగర్లో వినిపిస్తోంది. అయితే ఆమె పాక్ మూలాల నేపథ్యం కారణంగా కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ఇమాన్వీ, తాను అమెరికాలో జన్మించానని, తన కుటుంబానికి పాకిస్తాన్ వ్యవస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. భారతీయ సంస్కృతి తన రక్తంలోనే ఉందని చెప్పింది. ఈ విషయంలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇది నిజమా లేక గాలివార్తలా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!