

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్‌కు ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోయినా అభిమానులు మాత్రం కొంతవరకు సంతృప్తి చెందారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు దర్శకులు పవన్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతుండగా, సురేందర్ రెడ్డితో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సైరా సినిమా సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ కాంబినేషన్లో చిత్రం రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ ఏడాది జనవరిలో పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి చిత్రానికి అంగీకరించినట్లు ప్రకటన వెలువడింది. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ ప్రాజెక్టుకు కథలో మార్పులు జరుగుతున్నాయని, తుది రూపం వచ్చాక ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల సినిమాలకు పరిమిత సమయమే కేటాయించగలుగుతున్నారు. నెలకు 10 రోజుల చొప్పున చిత్రీకరణకు తేదీలు ఇచ్చి, వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుంది?, చిత్రీకరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!