

ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితకథ ఆధారంగా తెరకెక్కించాలనుకున్న చిత్రంలో నటించే అవకాశం చేజారిపోవడంపై బాలీవుడ్ నటి విద్యాబాలన్ విచారం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 2014లో దర్శకుడు రాజీవ్ మేనన్తో కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, ఆ సినిమాపై న్యాయస్థానం స్టే విధించడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. సుబ్బులక్ష్మి పాత్రలో నటించడం తన చిరకాల స్వప్నమని, ఆమె పాడిన సుప్రభాతంతోనే తమ ఇంట్లో రోజును ప్రారంభిస్తామని విద్యాబాలన్ గుర్తుచేసుకున్నారు. ఆమె జీవితం గురించి తనకు ఎంతో అవగాహన ఉందని, రాజీవ్ మేనన్ రూపొందించిన కథ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
ఆ సినిమాలో నటించాలనే తన కోరిక నెరవేరకపోయినా, రెండేళ్ల క్రితం ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి నివాళిగా ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించుకున్నట్లు విద్యాబాలన్ తెలిపారు. ఆ చిత్రాలు విస్తృతంగా ప్రచారం పొందాయని, అనంతరం తనకు పలు అవకాశాలు కూడా వచ్చాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్.’ పేరుతో మరో బయోపిక్ తెరకెక్కుతోంది. ‘ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!