

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నారు. అండర్ వరల్డ్ నేపథ్యంతో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆగస్ట్ 21న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ‘దసరా’, ‘హిట్ 3’ వంటి సినిమాల తర్వాత పూర్తి స్థాయి మాస్ హీరోగా తనను నిలబెట్టుకునే ప్రయత్నంలో నాని ఈ చిత్రంతో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. అయితే గ్లింప్స్‌లో వినిపించిన కొన్ని పదజాలం కారణంగా ట్రోలింగ్ ఎదురైంది. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ ఫలితం ఎలా ఉన్నా యాక్షన్ సినిమాల వైపే తన ఫోకస్ కొనసాగించాలని నాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు హిట్ ఇచ్చిన దర్శకుడు సుజీత్‌తో నాని తన 34వ సినిమాను చేయనున్నారు. గత ఏడాది విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్, అనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ మేళవింపుతో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగమా కాదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. నానిని స్టైలిష్‌గా కొత్త కోణంలో చూపించేందుకు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో క్యాస్టింగ్ విషయంలోనూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. నాని సరసన ‘యానిమల్’, ‘స్పిరిట్’ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కీలక పాత్ర కోసం 90వ దశకంలో డ్రీమ్ గర్ల్‌గా పేరుగాంచిన మాధురి దీక్షిత్‌ను సంప్రదించినట్లు సమాచారం. అది తల్లి పాత్రకోసం గానీ లేదా మరో ముఖ్యమైన పాత్రకోసం గానీ కావొచ్చని టాక్. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రంలోనూ నటించని మాధురి సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తే అది హాట్ టాపిక్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా ఈ ఎంపికలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!