

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెడుతున్న కొద్దీ విదేశీ నటులకు అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో పాన్ ఇండియా సినిమాల్లో హిందీ, తమిళ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటులను ప్రతినాయక పాత్రల్లో తీసుకోవడం సాధారణంగా ఉండేది. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ హాలీవుడ్ నటుల వైపు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ వంటి విదేశీ నటులను కీలక పాత్రల్లో తీసుకురావడం ద్వారా ఎస్‌ఎస్ రాజమౌళి ఈ ట్రెండ్‌కు బలమైన దిశ చూపించారు. తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1854-1878 మధ్య బ్రిటీష్ పాలన, రాయలసీమ నేపథ్యంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కథకు సరిపోయే విదేశీ నటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో ‘స్పిరిట్’లో డాన్ లీని తీసుకురావాలనే ఆలోచన జరిగినప్పటికీ, సరైన పాత్ర కుదరకపోవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘రాకా’లో విలన్ పాత్ర కోసం అట్లీ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ను సంప్రదిస్తున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగానే విల్ స్మిత్ ఈ సినిమాలో భాగమయ్యారా, లేక అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న ప్రచారమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అల్లు అర్జున్, అట్లీ కలయికలో తెరకెక్కుతున్న ‘రాకా’కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది. సినిమా ప్రచారం, టీజర్ లేదా ట్రైలర్ ద్వారా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!