

టాలీవుడ్లో కొత్త హీరోలు పరిచయమవుతూనే ఉన్నా, స్టార్ హీరోల వారసుల ఎంట్రీపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన వారసుల్లో గౌతమ్ ఘట్టమనేని ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు కుమారుడిగా గౌతమ్ ఎప్పుడెప్పుడు హీరోగా అడుగుపెడతాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘1: నేనొక్కడినే’ సినిమాలో బాలనటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్, ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం గౌతమ్ అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. కేవలం స్టార్ బ్యాక్‌గ్రౌండ్‌పై కాకుండా, నటనలో పూర్తిగా సిద్ధమయ్యాకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని మహేష్ బాబు భావిస్తున్నట్టు సమాచారం. ట్రైనింగ్ పూర్తైన తర్వాతే గౌతమ్ డెబ్యూ సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గౌతమ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే నిర్మాత ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ రేసులో సీనియర్ నిర్మాత అశ్వినీ దత్, మహేష్ బాబుకు సన్నిహితుడైన అనిల్ సుంకర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అశ్వినీ దత్‌కు స్టార్ కిడ్స్ను లాంచ్ చేసిన మంచి సెంటిమెంట్ ఉంది. మరోవైపు అనిల్ సుంకర కూడా గౌతమ్‌ను లాంచ్ చేయాలనే ఆసక్తి చూపుతున్నారు. అయితే నిర్మాతలకంటే కూడా, సరైన కథ, సరైన దర్శకుడిని ఎంపిక చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది. అధికారిక డేట్ ఇంకా రాకపోయినా, గౌతమ్ డెబ్యూ మాత్రం టాలీవుడ్లో భారీ ఈవెంట్‌గా మారనుందన్నది ఖాయం.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!