

మల్టీ టాలెంటెడ్ నటిగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన, బలమైన పాత్రలను ఎంచుకునే శృతి హాసన్ ఈ సినిమాలోనూ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్‌గా ప్రేక్షకులను అలరించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ‘కృష్ణ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సాత్విక వీరవల్లి ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆసక్తికరమైన తారాగణం, శృతి హాసన్ పాత్రపై వినిపిస్తున్న వార్తలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!