

కొంచెం ప్రామిసింగ్‌గా కనిపించే హీరో అయితే చాలామంది నిర్మాతలు వెంటపడటం సహజం. నిర్మాతలు క్యూ కడితే హీరో రెమ్యూనిరేషన్ కూడా పెరుగుతుంది. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికి మినిమమ్ గ్యారంటీ ఉన్న మిడ్ రేంజ్ హీరోలు చాలా తక్కువ. ఇప్పటికే కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు పది కోట్ల వరకు రెమ్యూనిరేషన్ కోరుతున్నారని వినిపిస్తోంది. వాళ్లకంటే కాస్త వెనుక ఉన్న హీరోలు ఏడుకోట్లు అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు ఐదు కోట్లు రెమ్యూనిరేషన్ అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఒక సినిమాకు మూడు కోట్లు హీరో రెమ్యూనిరేషన్, తొమ్మిది నుంచి పది కోట్లు సినిమా ఖర్చు చేస్తే మొత్తం బడ్జెట్ పన్నెండు కోట్లు అయ్యేది. థియేటర్ మార్కెట్ ద్వారా ఆరు లేదా ఏడు కోట్లు వస్తే, మిగతా మొత్తాన్ని ఓటీటీ ద్వారా తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు రెమ్యూనిరేషన్ పెరగడంతో బడ్జెట్ పదిహేను కోట్లకు చేరుతోంది. కథ, నటీనటులు కొంచెం ప్రత్యేకంగా ఉంటే ఖర్చు ఇంకా పెరుగుతుంది. దీంతో సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహంతో, “అందుబాటులో ఉన్న హీరో కూడా ఇప్పుడు అందడం లేదే” అంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!