

సంక్రాంతి, సమ్మర్ సీజన్లు టాలీవుడ్‌కు బాక్సాఫీస్ పండుగలాంటివి. ఈసారి మార్చి చివర్లో భారీ క్లాష్ జరుగుతుందని ప్రచారం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మరియు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ దాదాపు ఒకే సమయంలో విడుదలవుతాయని టాక్ వినిపించింది. దీంతో ఇద్దరి సినిమాల మధ్య డైరెక్ట్ క్లాష్ ఖాయమని భావించారు. అయితే తాజా పరిణామాలతో ఈ క్లాష్ తప్పినట్టే కనిపిస్తోంది.
సమాచారం ప్రకారం, నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఇంకా సగం మాత్రమే పూర్తయింది. ఇంకా 50–60 రోజులు షూటింగ్ మిగిలి ఉండటంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, పాన్ ఇండియా ప్రమోషన్లు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. అందుకే మార్చి రిలీజ్ కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను మే లేదా జూన్ 2026 కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా, మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం.
ఇక రామ్ చరణ్ ‘పెద్ది’ విషయంలో మాత్రం స్పష్టత ఉంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా మారనుందని అంచనా. ‘ది ప్యారడైజ్’ వాయిదా పడితే, ‘పెద్ది’ కి బాక్సాఫీస్‌లో పెద్ద అడ్వాంటేజ్ లభించనుంది. ఇది నాని చేసిన త్యాగమా? లేక మేకర్స్ తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయమా అన్నది అధికారిక ప్రకటనతోనే తేలాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం 'పెద్ది' మీదే ఉండబోతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!