

అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మేకర్స్ గతేడాది నుంచి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో విల్ స్మిత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరి నటీనటుల ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ‘రాకా’లో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో మొత్తం నలుగురు కథానాయికలు ఉండనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విల్ స్మిత్, షారుక్ ఖాన్, అల్లు అర్జున్ ఒకే సినిమాలో కనిపిస్తారనే వార్తలు నిజమైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!