

ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచ వైన్ రాజధానిగా పేరొందిన బోర్డో నగరాన్ని కలవరపెడుతోంది. అగ్నికీలలు వేగంగా విస్తరిస్తూ నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్నట్లు సమాచారం. మంటలు బోర్డో శివార్లకు చేరకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బోర్డోకు వైన్ తయారీలో శతాబ్దాల చరిత్ర ఉంది. రోమన్ల కాలం నుంచే ఈ ప్రాంతంలో ద్రాక్ష సాగు జరుగుతుండగా, అనుకూల వాతావరణం, నదీ మార్గాలు, వాణిజ్య అవకాశాలతో ప్రపంచ ప్రఖ్యాత వైన్ కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం వేలాది ద్రాక్ష తోటలు, వైన్ ఎస్టేట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
వైన్‌తో పాటు చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక విశేషాలకు కూడా బోర్డో ప్రసిద్ధి చెందింది. గరోన్ నది నెలవంక ఆకారంలో ఉండటంతో ‘పోర్ట్ ఆఫ్ ది మూన్’గా పేరొందిన చారిత్రక ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉంది. వాటర్ మిర్రర్ సహా అనేక చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సీఫుడ్, వైన్‌తో కూడిన ప్రత్యేక వంటకాలు, కనలె పేస్ట్రీ కూడా బోర్డో ప్రత్యేకతలు. ఇదిలా ఉండగా, ఫ్రాన్స్‌తో పాటు స్పెయిన్‌లోనూ కార్చిచ్చు తీవ్రత ఆందోళన కలిగిస్తుండటంతో ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!