

పోలవరం ప్రాజెక్టు సివిల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదించింది. భూసేకరణ పనులు 97 శాతం, సహాయ పునరావాస కార్యక్రమాలు 52 శాతం పూర్తయ్యాయని వెల్లడించింది. ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 2028 నాటికి 36 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మరో రూ.37,102.26 కోట్లు అవసరమవుతాయని గురువారం సమర్పించిన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో కీలకమైన ఎర్త్ కం రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ వద్ద గ్యాప్-1 పనులు 51 శాతం, గ్యాప్-2 పనులు 47 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు కనెక్టివిటీ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి, మిగిలిన అప్రోచ్ చానల్ పనులను వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు నివేదిక తెలిపింది. ఎడమ ప్రధాన కాలువ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. జాతీయ రహదారులను అనుసంధానించే కనెక్టివిటీ వంతెన డిజైన్లకు వచ్చే నెలలో ఆమోదం లభించే అవకాశం ఉందని, దీని నిర్మాణాన్ని 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందం ప్రధాన డ్యామ్ పనులు, నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. కొండ అంచుల వద్ద చేపట్టిన జెట్ గ్రౌటింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారని, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ఉపయోగిస్తున్న మట్టి, ఇసుక మిశ్రమాలు కూడా బాగున్నాయని నిపుణులు ప్రశంసించినట్లు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!