

మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పిల్లల పెంపకం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డిజిటల్ క్రియేటర్ నేహా బేడి నిర్వహించిన ‘ది లైఫ్ సేవర్స్ షో’లో పాల్గొన్న ఆయన.. పిల్లలు ఖరీదైన జీవనశైలికి అలవాటు పడటానికి ముందు డబ్బు విలువ తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన కుమారులు అండర్-16, అండర్-19 స్థాయుల్లో క్రికెట్ ఆడుతూ సొంతంగా సంపాదిస్తున్నారని తెలిపారు. ఒకసారి కారులో పెట్రోల్ నింపించినప్పుడు బిల్లు రూ.7 వేలు అయిందని, తండ్రి డబ్బుతో చెల్లించినప్పుడు పిల్లలు ఆ మొత్తాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. అయితే అదే మొత్తాన్ని సొంత డబ్బుతో చెల్లించాల్సి వచ్చినప్పుడు వారికి ఖర్చుల విలువ అర్థమైందని సెహ్వాగ్ వివరించారు.
బ్రాండెడ్ వాచీలు, లగ్జరీ కార్లపై పిల్లలకు ఆసక్తి ఉండటం సహజమేనని, అయితే ఇతరులను ఆకట్టుకోవడానికి మాత్రమే జీవించడం కంటే తమ విజయాలతో గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విషయమని సెహ్వాగ్ అన్నారు. ప్రదర్శన కోసం చేసే ఖర్చుల కంటే కష్టపడి సాధించిన విజయాలే నిజమైన గౌరవాన్ని అందిస్తాయని తన కుమారులకు చెబుతుంటానని వెల్లడించారు. క్రికెట్‌లో తండ్రితో పోలికలు, విమర్శలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. పిల్లలు డబ్బు విలువను అర్థం చేసుకోవడంతో పాటు, విమర్శలను తట్టుకుని తమ లక్ష్యాల దిశగా ముందుకు సాగడం కూడా ముఖ్యమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!