

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2026 సీజన్ 2 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ అప్పలనాయుడు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీదేవితో కలిసి నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. నగర ప్రజల సహకారంతోనే ఉత్సవాలు విజయవంతమయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఏలూరు రోడ్డుపై భారీ కార్నివాల్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సుమారు 3,000 మంది కళాకారులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్నివాల్‌ను తిలకించాలని కోరారు. ఉత్సవాల్లో భాగస్వామి కావడానికి శర్వానంద్ ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్న నిర్వాహకులు, ఆయన నటిస్తున్న భోగి సినిమా ఘన విజయం సాధించాలని కనకదుర్గ అమ్మవారిని ప్రార్థించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలను ఒక్కచోట చేర్చే వేడుకగా నిలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!