

బ్రిటన్లోని వెస్ట్మిడ్ల్యాండ్స్ ప్రాంతంలో భారతీయ విద్యార్థులు వేధింపులకు గురైన ఘటన కలకలం రేపుతోంది. సోలిహల్లోని మెరిడెన్ పార్క్లో అర్ధరాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్న చెల్మ్స్లీ వుడ్ పేట్రియాట్స్ అనే స్వయంప్రకటిత రక్షక బృందం సభ్యులు ముగ్గురు భారతీయ విద్యార్థులను అడ్డుకున్నారు. వారు ఇంగ్లాండ్కు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ, పార్క్ నుంచి వెళ్లిపోవాలని, మళ్లీ అక్కడ కనిపించవద్దని హెచ్చరించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళలు, పిల్లల భద్రత కోసమే తాము గస్తీ నిర్వహిస్తున్నామని, పార్కులు పిల్లలు, కుటుంబాల కోసం మాత్రమే ఉండాలని పేర్కొంటూ తమ చర్యలను సమర్థించుకున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వారి చర్మం రంగు, జాతి ఆధారంగా లక్ష్యంగా చేసుకున్నారని స్థానిక ఉద్యమకారులు ఆరోపించారు. విమర్శల నేపథ్యంలో ఆ బృందం తన సోషల్ మీడియా ఖాతా నుంచి వీడియోను తొలగించింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, చట్టప్రకారం తనిఖీలు నిర్వహించే అధికారం పోలీసు అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. బృందం కార్యకలాపాలను తాము సమర్థించడం లేదని, ఏదైనా నేరం జరిగినట్లు ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన బ్రిటన్లో భారతీయ విద్యార్థుల భద్రత, జాతి వివక్షపై మరోసారి ఆందోళనలను పెంచింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!