

ఇరాన్‌పై తక్షణ సైనిక దాడులు చేపట్టే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇప్పుడే ఇరాన్‌పై దాడులు జరపబోమని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని ఒప్పందం ద్వారా పరిష్కరించాలా, లేక సైనిక చర్యతో ముగించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రకటనతో తక్షణ దాడుల ముప్పు తాత్కాలికంగా తగ్గినప్పటికీ, భవిష్యత్తులో సైనిక చర్యలు లేదా దౌత్య చర్చలు జరిగే అవకాశాలు కొనసాగుతున్నాయి.
ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయినా, మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సమాచార మార్పిడి జరుగుతోందని ఇరాన్ వెల్లడించింది. అయితే, అమెరికా విధించే షరతులను అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతూ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేత ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా మారింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ రాయబారి తెలిపినట్లు సమాచారం. అయితే, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధమైన మీడియా సంస్థలు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని పేర్కొంటూ ఈ వార్తలను ఖండించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!