

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా ట్రాన్స్‌ఫార్మర్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని తెలిపారు. ప్రజలు అధికారిక వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!