

ఆధునిక ప్రపంచంలో జెన్ జీ (Gen Z) యువత ఉద్యోగ జీవితంపై తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. కార్పొరేట్ రంగంలో ఉన్నత పదవులు, ప్రమోషన్లు, భారీ జీతాలు సాధించడమే విజయంగా భావించే పాత ధోరణికి భిన్నంగా.. వ్యక్తిగత జీవితం, మానసిక ప్రశాంతత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యతకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎడ్యుకేషన్, అప్‌స్కిల్లింగ్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ఎమెరిటస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దాదాపు 74 శాతం మంది జెన్ జీ ఉద్యోగులు లీడర్‌షిప్ హోదాల కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులు యువ ఉద్యోగులపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఒత్తిడిని పెంచుతున్నాయి. అధ్యయనం ప్రకారం సుమారు 60 శాతం మంది యువత నిరంతరం అప్‌స్కిల్ కావాలనే ఒత్తిడితో బర్న్‌అవుట్‌కు గురవుతున్నారు. అయితే, ఈ సవాలును ఎదుర్కొనేందుకు వారు సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తున్నారు. ఏకంగా 82 శాతం మంది జెన్ జీ ఉద్యోగులు ప్రతి వారం ఏఐ, జెనరేటివ్ ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తూ కొత్త నైపుణ్యాలను వేగంగా నేర్చుకుంటున్నారు.
జెన్ జీ ప్రాధాన్యతలు వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం కావడం లేదు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ కెరీర్స్ వైపు కూడా వారు ఆసక్తి చూపుతున్నారు. కేవలం జీతం, హోదాను కాకుండా మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో గుర్తింపు, పర్యావరణ స్పృహ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో పని, వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే కొత్త ఉద్యోగ సంస్కృతికి జెన్ జీ బాటలు వేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!