

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. హమాలీ, డొమెస్టిక్ వర్కర్ల కోసం వేర్వేరుగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి చట్టపరమైన చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నిబంధనలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్లో నిర్వహించిన “సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ లీడర్షిప్ అండ్ ట్రేడ్ యూనియన్స్: రీబిల్డింగ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ సోషల్ డైలాగ్” సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలోని సుమారు 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, సంఘటిత రంగ కార్మికులతో పోలిస్తే వీరికి హక్కుల పరిరక్షణ, ప్రాతినిధ్యం వంటి అంశాల్లో మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
తెలంగాణలో గత పదేళ్లుగా కనీస వేతనాలను ప్రకటించలేదని, తాను కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని ప్రకటించామని మంత్రి వెల్లడించారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యం పేరుతో కార్మికుల భద్రతను నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీల తనిఖీల్లో అధికారులు సూచించిన భద్రతా చర్యలను యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్ అందిస్తున్నామని, విదేశీ ఉపాధి అవకాశాల కోసం యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మందమర్రిలో 70 మంది యువతకు జర్మన్ భాషలో శిక్షణ అందిస్తున్నామని, వారికి జర్మనీలో ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, మాజీ ఎంపీ ఖుంతియా, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్‌తో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!