

ఎల్‌నినో ప్రభావాలు, వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 23న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కోసం నిర్వహించిన ఒకరోజు చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షపాతం 20 శాతానికి పైగా తగ్గిందని, పంట సాగు విస్తీర్ణం కూడా సుమారు 20 శాతం మేర తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 30 నుంచి 40 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, రానున్న జులై వరకు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. గత మూడు నెలలుగా విద్యుత్ వినియోగం గరిష్ఠంగా 20 వేల మెగావాట్లకు చేరినట్లు వెల్లడించారు. ఎల్‌నినో పరిస్థితులపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణానికి అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖలను సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, అవుట్డోర్, సామాజిక మాధ్యమాలతో పాటు జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు సందేశాలను చేరవేయాలని సూచించారు. అన్ని జిల్లాల జిల్లా పౌరసంబంధాల అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, ఎండల సమయంలో తగినంత నీరు తాగడం, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకపోవడం, వృద్ధులు, చిన్నారులు, ఇతర సున్నిత వర్గాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వంటి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. తాగునీటి వనరుల నిర్వహణ, నీటి కొరతను ఎదుర్కొనే ముందస్తు చర్యలతో పాటు వ్యవసాయ, విద్యుత్, పశుసంవర్ధక, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖల సమన్వయంతో ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!