

ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెట్టుబడులకు భరోసా, పరిశ్రమలకు నిరంతర విద్యుత్, వేగవంతమైన అనుమతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానిక సంస్థలకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పారిశ్రామిక రంగానికి నమ్మకమైన విద్యుత్ సరఫరా, పటిష్టమైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకమైన ప్రభుత్వ విధానాలు కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రకటనలతోనే అభివృద్ధి పూర్తికాదని, వాటి ద్వారా ఉత్పత్తి పెరిగి, స్థానిక సంస్థలకు ఆర్డర్లు లభించి, కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అందినప్పుడే వాటి అసలైన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఏరోస్పేస్ రంగంలో చిన్న పరికరం లేదా విడిభాగం వందలాది మంది ప్రాణాలకు భద్రత కల్పించగలదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రయాణికులకు ఆ పరికరాన్ని తయారు చేసిన సంస్థ గురించి తెలియకపోయినా, దాని నాణ్యతపై ఉన్న నమ్మకమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని, ప్రశంసలు, చప్పట్లు లభించకపోయినా బాధ్యతతో పనిచేసే వ్యవస్థల ద్వారానే విశ్వసనీయత ఏర్పడుతుందని వివరించారు.
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ప్రభుత్వం కూడా అదే స్థాయి ఖచ్చితత్వం, క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమల్లో కొలతలు మైక్రాన్ల స్థాయిలో ఉంటాయని, ప్రభుత్వ అనుమతులు, చెల్లింపులు, విద్యుత్ కనెక్షన్ల విషయంలో అనిశ్చితి నెలకొంటే నెలల తరబడి సాగిన ఉత్పత్తి ప్రయత్నాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు వేగంగా, విశ్వసనీయంగా అందాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!