

విజయవాడ నుంచి తిరుపతికి అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ఏపీ 39 యూఎక్స్ 9333 నంబరు గల బస్సు తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్‌లో చోరీకి గురైనట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం బస్టాండ్‌కు చేరుకున్న బస్సును డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ ప్రాంగణంలో పార్క్ చేసి విశ్రాంతి గదికి వెళ్లారు. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. దీంతో వారు వెంటనే ఆర్టీసీ అధికారులకు, బస్సు యజమానికి సమాచారం అందించారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రూ.46 లక్షల విలువైన బస్సు కదలికలను యజమాని జీపీఎస్ ద్వారా పరిశీలించగా, అది నంద్యాల జిల్లా వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టి, చాగలమర్రి పోలీసుల సహకారంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. రద్దీగా ఉండే బస్టాండ్‌లో ఇలాంటి ఘటన జరగడంతో రాత్రి వేళల్లో నిఘా పెంచాలని, సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!