

దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయంతో నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణాది రాష్ట్రాల పోలీస్ ప్రాంతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి భద్రత, రక్షణ పునాదులని, ప్రజలు సమర్థవంతమైన, నిష్పక్షపాత పోలీసు వ్యవస్థను కోరుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణలో పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా విభజించి మెరుగైన సేవలు అందిస్తున్నామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్‌కు కేంద్ర అవార్డులు లభించాయని వెల్లడించారు. ఆహార కల్తీని అరికట్టేందుకు టీజీ సేఫ్, ఆక్రమణల నియంత్రణకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, వారి పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్‌ను ప్రారంభించామని తెలిపారు. పోలీస్ శాఖపై చేసే వ్యయాన్ని పౌరుల భద్రతకు పెట్టుబడిగా భావిస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!