

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌లోనే ‘Belonging: A Journey of Love’ పేరుతో రూపొందిన ఆత్మకథ ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు. ప్రేమ, కర్తవ్యం, విషాదాలు, జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణం వంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. తన జీవిత కథను పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పుస్తకం తొలి ప్రతులను అందుకున్న ఆమె, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాటిని పరిశీలించారు. పుస్తకంలోని ఫొటోల గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అనంతరం ప్రియాంక తన తల్లికి స్వీట్లు తినిపించగా, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోనే సోనియా గాంధీ తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా పంచుకున్నారు. ఈ ఆత్మకథను నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు అనేక కీలక అంశాలు ఈ ఆత్మకథలో చోటుచేసుకున్నాయి. యుద్ధానంతర ఇటలీలో ఆమె బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం అనంతరం భారత్‌కు రావడం, నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఆమె జీవితం వంటి విషయాలను ఇందులో వివరించినట్లు సమాచారం. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య వంటి విషాద ఘటనలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశాలనూ ప్రస్తావించారు. ఆ పరిణామాల అనంతరం సోనియా గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోషించిన పాత్రకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ పుస్తక ప్రచురణ విషయంలోనూ మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రచురణ బాధ్యతలు చేపట్టాల్సిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. అనంతరం హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురణ బాధ్యతలు చేపట్టింది. నవంబర్ 10న విడుదల కానున్న ఈ ఆత్మకథపై రాజకీయ, సాహిత్య వర్గాలతో పాటు పాఠకుల్లోనూ ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!