

దేశం గత కొన్ని దశాబ్దాలుగా కొత్త సవాళ్లు, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సమష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు. విభజనవాద శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని సంఘటితం చేయడంతోపాటు, స్వయంసమృద్ధి దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. దిల్లీలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్’లో ఆయన ప్రసంగించారు. చిన్మయ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి చిన్మయానంద దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు తాను గత పాతికేళ్లుగా కృషి చేస్తున్నానని తెలిపారు. వేదాంతాలు, భగవద్గీతలోని జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడంలో చిన్మయ మిషన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ సంస్థ కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదని, అదొక ఆలోచన అని మోదీ అభివర్ణించారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ చురుగ్గా భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. నూతన భారత అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని, మాతృభాషలో బోధనతోపాటు భారతీయ విజ్ఞాన సంప్రదాయాలకు అందులో ప్రాధాన్యం కల్పించామని వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా యువత సుమారు 300 రోజుల్లో 40,000 కిలోమీటర్లు ప్రయాణించడం అభినందనీయమన్నారు. గత 12 ఏళ్లలో విదేశాలకు తరలిపోయిన 650 విలువైన భారతీయ కళాఖండాలను తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపారు. త్రీడీ హోలోగ్రాఫిక్ డిజిటల్ రూపంలో కనిపించిన స్వామి చిన్మయానందతో సంభాషించిన అనుభూతి కలిగిందని చెప్పారు. 1951లో ప్రారంభమైన చిన్మయ మిషన్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏడాది కాలంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముగింపు వేడుకల్లో దేశవిదేశాల నుంచి సుమారు 9,000 మంది పాల్గొంటున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!