

సుదీర్ఘ విమాన ప్రయాణంలో ప్రయాణికులకు తగిన ఆహారం అందించలేదన్న ఫిర్యాదుపై సింగపూర్ ఎయిర్‌లైన్స్ సేవా లోపానికి పాల్పడిందని పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి మానసిక క్షోభ కలిగించినందుకు, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం కలిపి రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జస్ప్రీత్ సింగ్ భార్య, అత్తగారు, 11 నెలల కుమార్తె 2020 మార్చి 4న ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్‌కు సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 15 నుంచి 16 గంటల పాటు సాగగా, తమ కుటుంబానికి సరిపడా ఆహారం అందించలేదని, కనీసం పసిపాపకు పాలు కూడా ఇవ్వలేదని జస్ప్రీత్ సింగ్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తొలుత జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, టికెట్ ధర రూ.1.25 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సింగపూర్ ఎయిర్‌లైన్స్ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. సాధారణ మెనూ ప్రకారం ఆహారం అందించామని, ప్రయాణికులు ముందుగా ప్రత్యేక లేదా శాఖాహార భోజనాన్ని కోరలేదని సంస్థ వాదించింది. అయితే, ప్రత్యేక ఆహారం కోసం ముందస్తు అభ్యర్థన చేయనంత మాత్రాన సుదీర్ఘ ప్రయాణంలో కనీస ఆహారం అందించే బాధ్యత నుంచి విమానయాన సంస్థ తప్పించుకోలేదని కమిషన్ పేర్కొంది. పసిపాపతో ప్రయాణించిన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని పూర్తి చేసినందున మొత్తం టికెట్ ధరను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని భావించి, జిల్లా ఫోరమ్ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. 45 రోజుల్లోగా బాధిత కుటుంబానికి ఉమ్మడిగా రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!