

భద్రతే అభివృద్ధికి పునాది అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ సంస్థలకు రక్షణ కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్పీఎఫ్) తెలంగాణ ప్రగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అక్టోబర్ 23న అమీన్పూర్లో నిర్వహించిన దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. 1991 అక్టోబర్ 23న ఏర్పాటైన ఈ దళం ప్రస్తుతం తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వ కీలక సంస్థలు సహా మొత్తం 67 సంస్థలకు భద్రత కల్పిస్తోందని తెలిపారు. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. భవనాలు, సంస్థలను కాపాడటమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చూడటం, ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడం కూడా టీజీఎస్పీఎఫ్ బాధ్యతల్లో భాగమని వివరించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధికి పటిష్టమైన భద్రత అవసరమని స్పష్టం చేశారు.
యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రక్షణ కల్పించడంలో టీజీఎస్పీఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలను భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్రోన్లు, కృత్రిమ మేధ, ఆధునిక నిఘా వ్యవస్థలు, సైబర్ సాంకేతికతతో అనుసంధానమైన మౌలిక సదుపాయాల వల్ల భద్రతా రంగంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు సిబ్బందికి నిరంతర శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నిజాయితీ అవసరమని పేర్కొన్నారు. టీజీఎస్పీఎఫ్ సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, శిక్షణ అవకాశాలు, మెరుగైన పని పరిస్థితులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని హామీ ఇచ్చారు. పండుగలు, సెలవులు, రాత్రివేళలు, అత్యవసర సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బందితో పాటు వారికి మద్దతుగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల సేవలను కూడా గుర్తించి అభినందించారు. తెలంగాణను మరింత సురక్షితమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో టీజీఎస్పీఎఫ్ తన పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!