

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు చెందిన 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం డార్క్‌వెబ్‌లో బయటపడినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నెల 16వ తేదీన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ (డీసీఏ), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) నుంచి డేటా లీక్‌కు సంబంధించిన హెచ్చరికలు అందాయని ఎస్బీఐ తెలిపింది. ఈ ఘటనతో తమ బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, లీక్ వల్ల సంభవించిన ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఖాతాదారుల సమాచారం బయటపడినంత మాత్రాన వారి ఖాతాల్లోని డబ్బు పోదని భరోసా ఇచ్చింది. అయితే, లీకైన సమాచారాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందిగా నటిస్తూ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా ఎవరైనా ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి రహస్య వివరాలు అడిగితే వాటిని వెల్లడించవద్దని ఖాతాదారులకు సూచించింది.
మరోవైపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన వ్యాపార వ్యూహాలు, ఇతర సున్నితమైన సమాచారం లీకైనట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ సమాచారాన్ని బ్యాంకుకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు బయటపెట్టినట్లు గుర్తించారని తెలిపింది. ఇదే సమయంలో, భారతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ-ముద్ర గత ఏడాది జారీ చేసిన ఎనిమిది డిజిటల్ సర్టిఫికెట్లలోని క్రిప్టోగ్రాఫిక్ కీలు బలహీనంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. వాటిని సుమారు ఒక్క సెకనులోనే ఛేదించగలిగారని నివేదిక వెల్లడించింది. ఈ లోపాన్ని దుర్వినియోగం చేస్తే నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, వినియోగదారులను అసలు వెబ్‌సైట్ల నుంచి దారి మళ్లించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్, యాపిల్, మొజిల్లా, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఈ-ముద్ర డిజిటల్ సర్టిఫికెట్లను బ్లాక్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలు డిజిటల్ భద్రత, సమాచార గోప్యతపై మరింత అప్రమత్తత అవసరాన్ని తెలియజేస్తున్నాయి. వినియోగదారులు అనుమానాస్పద కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు అధికారిక బ్యాంకింగ్ మార్గాలనే ఉపయోగించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!