

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ముస్తాబవుతోంది. పూల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ఈ వేడుకలు జరగనున్నాయి. పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ వేడుకల్లో సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో సద్దుల బతుకమ్మ సంబరాలపై సందడి నెలకొంది. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణ కళలు, జానపద సంప్రదాయాలను ప్రతిబింబించేలా సుమారు 700 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలతో పండుగ వాతావరణాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది. పూల అలంకరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షోతో ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా మారనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!