

ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఇతర వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 22 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, 23వ తేదీ నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 25 లేదా 26వ తేదీ నాటికి అల్పపీడనంగా మారవచ్చని అంచనా. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడనాల్లో ఒకటి బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏది బలపడుతుందో వచ్చే వారం ప్రారంభంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
డిసెంబరు నాటికి మరింత వేడి వాతావరణం
భూమధ్యరేఖకు సమీపంలోని పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, శక్తివంతమైన ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడంతో గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 86.25 మి.మీ., ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.69 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొక్కంటి, అన్నమయ్య జిల్లాలోని అమ్మచెరువు ప్రాంతాల్లో 66.05 మి.మీ. వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!