

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్టోబర్ 18, 19 తేదీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగవచ్చని అంచనా వేసింది.
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదు. అత్యవసరం కానప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వాగులు, నదుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు పంటల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసే అధికారిక హెచ్చరికలను అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!