

భారత క్రికెట్ జట్టుకు ఆటగాడిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన రాహుల్ ద్రవిడ్.. ప్రధాన కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. మైదానంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన తాజాగా ఓ అభిమానితో వ్యవహరించిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది. తన సోదరీమణులతో కలిసి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి అనుకోకుండా రాహుల్ ద్రవిడ్ పక్కన కూర్చునే అవకాశం లభించింది. దీంతో ఎంతో సంతోషించిన ఆ యువకుడు వెంటనే ఆయన వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ కోరాడు. ద్రవిడ్ కూడా ఎలాంటి అసహనం చూపకుండా చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
ఈ మధురమైన అనుభవాన్ని ఆ యువకుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో రూపంలో పంచుకున్నాడు. ‘ఇందిరానగర్ గూండా చాలా స్వీట్’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. విమానం దిగిన తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు ద్రవిడ్ బస్సు ఎక్కిన దృశ్యాలను కూడా ఆ వీడియోలో చేర్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిమానులు ద్రవిడ్ నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు. గతంలో ఓ వాణిజ్య ప్రకటనలో రాహుల్ ద్రవిడ్‌ను ‘ఇందిరానగర్ గూండా’గా చూపించడం అప్పట్లో విశేషంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే పేరుతో అభిమాని చేసిన వ్యాఖ్య మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!