

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే అవి చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బారికేడ్లు దాటి చట్టసభల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడంతో పాటు ప్రజా వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణలోనూ నిరసనల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు చేసిందని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే నిరుద్యోగుల సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై టెండర్ల ప్రక్రియ నుంచి తుది చెల్లింపుల వరకు పూర్తిస్థాయి సీబీఐ విచారణకు కాంగ్రెస్ సిద్ధమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. విచారణను కొన్ని బ్యారేజీలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తూ, గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య సంబంధాలను గుర్తుచేశారు. బీసీల జనాభా 56 శాతమని చెబుతున్న కాంగ్రెస్, క్యాబినెట్‌లోనూ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం, ఎస్‌ఐఆర్, బీసీలకు ప్రాతినిధ్యం, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌తో చర్చకు సిద్ధమని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!