

ఏషియన్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అభినందించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో భారత క్రీడా బృందంతో సమావేశమైన ఆయన.. స్వర్ణ పతకాలు సాధించిన పురుషుల, మహిళల క్రికెట్ జట్ల సభ్యులతో పాటు ఇతర పతక విజేతలను ప్రశంసించారు. భారత క్రీడాకారులు తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా క్రీడాకారులు విజయాలు సాధించారని, త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేయడం గొప్ప విజయమని మోదీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయాలు వ్యక్తిగత విజయాలకే పరిమితం కావని, అవి యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ప్రధానితో ఫొటోలు దిగుతూ తమ విజయాల జ్ఞాపకాలను పంచుకున్నారు. పలువురు మోదీకి జ్ఞాపికలను అందజేశారు. 17 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి కుమ్కుమ్ మొహోద్ తన సంతకంతో కూడిన విల్లును ప్రధానమంత్రికి బహూకరించింది. భారత క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ జై షా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పతక విజేతలను అభినందించిన ప్రధాని.. వారి విజయాలు దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!