

దేశ ఐక్యతను కాపాడుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని డీడీఏ ఉత్సవ్ మైదానంలో శ్రీరామ్‌లీల కమిటీ నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన, రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే, సమాజాన్ని విభజించే శక్తులను ఎదుర్కోవడానికి ప్రజలు ఐక్యంగా ఉండాలని అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే రామ్‌లీల కార్యక్రమాలు శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచుతూ, అసత్యంపై సత్యం విజయం సాధిస్తుందనే సందేశాన్ని అందిస్తున్నాయని వివరించారు.
శ్రీరాముడి పాలనా ఆదర్శాలను ప్రస్తావించిన మోదీ, రామరాజ్యం అంటే వివక్షకు తావులేని పాలన, అందరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థ అని పేర్కొన్నారు. అధికారం అంటే ప్రజలను పాలించడం మాత్రమే కాదని, వారికి సేవ చేయడమేనని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శ్రీరాముడు లంకకు సాగించిన ప్రయాణాన్ని స్వావలంబన, దృఢ సంకల్పం, సమష్టి కృషికి ఉదాహరణగా అభివర్ణించారు. సవాళ్లు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా, మన సామర్థ్యాలపై నమ్మకంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా కష్టపడి పనిచేయాలని, ఐక్యతతో ఎంతటి కఠినమైన సవాలునైనా అధిగమించవచ్చని ప్రధాని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!