

తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రహదారిని ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.4.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిలో సుమారు 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేసినట్లు అధికారులు వివరించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం ప్రజాధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ చర్యలకు పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉన్నవారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచి వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!