

నిర్మల్ పట్టణంలోని నాయిడివాడలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం గొప్ప యోధుడే కాకుండా ధైర్యసాహసాలు, దేశభక్తి, ధర్మరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, పరిపాలనా దక్షత, ప్రజల పట్ల బాధ్యత నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, మరిన్ని గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, సమర్థవంతమైన పరిపాలన, ప్రజల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు, అనుసరించిన ఆదర్శాలు చిరస్మరణీయమని పేర్కొంటూ, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సమాజ సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, మహనీయుల చరిత్రను, వారి ఆదర్శాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు ఆకారపు కేశవరాజు, కమిటీ అధ్యక్షుడు కృష్ణ, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!