

ఆన్‌లైన్ గేమింగ్ వల్ల చేసిన అప్పులు తీర్చుకోవడంతో పాటు ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లేందుకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ నీట్ విద్యార్థి తన కిడ్నాప్ జరిగినట్లు నాటకమాడాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన 17 ఏళ్ల యువకుడు లఖ్‌నవూలోని అలంబాగ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడిన అతడు, అందుకోసం సుమారు రూ.50 వేల అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు తండ్రి నుంచి డబ్బులు వసూలు చేయాలని కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. అక్టోబర్ 20 నుంచి అతడి ఫోన్ అందుబాటులో లేకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత యువకుడిని కిడ్నాప్ చేశామని, అతడిని సురక్షితంగా విడిచిపెట్టాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతడి సోదరుడు, తల్లిదండ్రులు, మేనమామకు వాట్సప్ సందేశాలు వచ్చాయి. డబ్బులు చెల్లించకపోతే యువకుడిని చంపేస్తామని బెదిరించడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు, యువకుడు తన ఫోన్ ద్వారా అత్త కూతురికి సందేశం పంపి, తాను ఎక్కడున్నాడో తెలియడం లేదని, తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పాడు. డబ్బులు పంపాలని క్యూఆర్ కోడ్ పంపడంతో ఆమె రూ.2,000 బదిలీ చేసింది. ఆన్‌లైన్ లావాదేవీ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ కనుగొని, ప్రియురాలితో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, డబ్బుల కోసమే ఈ నాటకమాడినట్లు అతడు అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!