

మధ్యప్రదేశ్‌లోని రీవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రీవాలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన సభలో మాట్లాడుతూ, భారత్‌లో వ్యాపారం చేయాలంటే దేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మస్క్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, భారత్‌ను ఎవరూ కొనలేరని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. భారత్ నిబంధనలు నచ్చి వ్యాపారం చేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతామని, లేదంటే వెనుదిరిగి వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు. మస్క్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
భారత్‌లో తన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్టార్‌లింక్ అనుమతుల ప్రక్రియలో జాప్యంపై మస్క్ గతంలో సామాజిక మాధ్యమాల్లో స్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిశ్రా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రీవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ మిశ్రా, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఆయన సూటిగా మాట్లాడే శైలి గతంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!