

భారత్‌లో పలు హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అమెరికాలో అరెస్టయ్యాడు. అమెరికా లాస్ వేగాస్‌లో అక్టోబర్ 22న హిమాన్షు భౌతో పాటు మరో నిందితుడు నీరజ్ ఫరీద్‌పురియాను అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అందించిన సమాచారంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సహకారంతో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. ఢిల్లీ, హర్యానా పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిమాన్షు భౌ.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా గుర్తింపు పొందాడు. అతడిపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన హిమాన్షు భౌ విదేశాల్లో ఉంటూ తన ముఠా కార్యకలాపాలను కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పోర్చుగల్‌లో ఉన్న సమయంలోనూ అతడి నెట్‌వర్క్ కార్యకలాపాలు సాగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులు, వసూళ్లకు సంబంధించిన కేసుల్లో అతడి పేరు ఉంది. 2023 ఆగస్టులో అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయింది. ప్రస్తుతం అమెరికా అధికారుల అదుపులో ఉన్న హిమాన్షు భౌను భారత్‌కు తీసుకొచ్చేందుకు హర్యానా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ చట్టపరమైన విధానాలపై ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!