

రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక తయారీ కేంద్రంగా, గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు, ఆహార శుద్ధి, వస్త్రాలు, ఆతిథ్య రంగాల్లో రూ.5,217.39 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో 23 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 7,613 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతపురంలోని జేఎన్‌టీయూలో శుక్రవారం ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని పారిశ్రామిక అవకాశాలపై సదస్సులో చర్చించారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో కియా ప్లాంట్ పరిసరాల్లో ఆటోమొబైల్ విడిభాగాల తయారీకి హ్వాసిన్ ఆటోమోటివ్ రూ.850 కోట్లు, ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీకి సియోయాన్ రూ.514 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కర్నూలులో ఇవామెట్ ఇండియా రూ.250 కోట్లతో విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ అభివృద్ధి, ఏరోస్పేస్ కాంప్లెక్స్, రక్షణ పరికరాలు, డ్రోన్ తయారీ ప్రాజెక్టులతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. చిత్తూరులో నకోడా డెయిరీ రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించనుంది. శ్రీసత్యసాయి జిల్లాలో వస్త్ర పరిశ్రమలు, అనంతపురం, కడపలో హోటళ్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో కుదిరిన పారిశ్రామిక ఒప్పందాల్లో 70 శాతానికి పైగా అమలు దశలో ఉన్నాయని ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. గత రెండేళ్లలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, వాటిలో రూ.16.16 లక్షల కోట్లు కేటాయింపుల స్థాయికి చేరాయని ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్ వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!