

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనుండగా, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఒకే దశలో నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో జరపనున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం 100 చోట్ల మాత్రమే ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు మరో 19 పురపాలక సంఘాలకు డిసెంబరులో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికలకు అక్టోబరు 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబరు 28న పోలింగ్, అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ), విజయవాడ నగరపాలక సంస్థలకు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేయగా, మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా 11 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. మొత్తం 9,983 ఎంపీటీసీ, 662 జడ్పీటీసీ స్థానాలకు అక్టోబరు 21 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 5న ఫలితాలు వెల్లడిస్తారు. అలాగే 13,185 గ్రామ పంచాయతీలకు నవంబరు 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. ప్రతి విడతలోనూ పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. సంబంధిత పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఎన్నికల అధికారులు శుక్రవారం స్థానికంగా ఎన్నికల నోటీసులు జారీ చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!