

దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో ర్యాలీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 6 వేల మంది దిల్లీ పోలీసులతో పాటు 220 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచారు. కన్నాట్‌ప్లేస్, రాజీవ్ చౌక్, సెంట్రల్ పార్క్, జంతర్ మంతర్, పాలికా బజార్, సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్లు, ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. శుక్ర, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌లోకి ప్రజలకు అనుమతి లేదని న్యూదిల్లీ పురపాలక మండలి ప్రకటించింది. పరిమిత సంఖ్యలో పాల్గొనే వారితో ప్రత్యామ్నాయ ప్రదేశంలో ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని దిల్లీ పోలీసులు తెలిపారు.
సెంట్రల్ పార్క్‌లో శాంతియుతంగా జాతీయ జెండాను ఎగురవేస్తామని, ఇందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చినా సిద్ధమేనని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. మరోవైపు, సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తూ న్యూదిల్లీ పురపాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరూ వివేకంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం.. పండుగల సమయంలో నిరసనల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రస్తావించింది. నిరసన తెలిపే హక్కు, జీవనోపాధి, శాంతిభద్రతలు పరస్పరం ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే, నగరంలో నిషేధాజ్ఞలు విధించడం వల్లే వ్యాపారాలు దెబ్బతింటాయని, శాంతియుత నిరసనల వల్ల కాదని అభిజీత్ దీప్కే అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!