

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న నదీ జలాల వివాదాల పరిష్కారంపై వచ్చే వారం రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), 30న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాలు నిర్వహించనున్నారు. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల అనుమతులు, నీటి వినియోగం, రెండు రాష్ట్రాలు చేసుకున్న పరస్పర ఫిర్యాదులు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తమ రాష్ట్రంలో అధికంగా ఉన్నందున 70:30 నిష్పత్తిలో కేటాయింపులు జరగాలని తెలంగాణ వాదిస్తోంది. ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాబోయే భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు, జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలు, తాగునీటికి ప్రాధాన్యం, సాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపైనా బోర్డులు సమీక్షించే అవకాశం ఉంది. నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, పనిచేయని పరికరాల స్థానంలో ఆధునిక పరికరాలను అమర్చడం, ప్రాజెక్టుల అనుమతులు, బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెల్లించాల్సిన నిధుల అంశాలు కూడా చర్చకు రావచ్చు. ఈ నెల 30న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్ ప్రభావంపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు మరోసారి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు పాల్గొనే ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో జలాల నిర్వహణపై ప్రభావం చూపనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!