

ఖతార్‌లోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనుబంధ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC) కార్యాలయంలో జరిగిన దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేరళకు చెందిన బీజేపీ నాయకుడు పరప్పిల్ బాలకృష్ణన్ కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గత ఏడాది సెప్టెంబరులో ఖతార్‌లోని అల్ తుమామా ప్రాంతంలో ఉన్న కేఎంసీసీ కార్యాలయంలో నగదు లాకర్‌ను పగలగొట్టి, 31 లక్షల ఖతారీ రియాల్స్ (సుమారు రూ.8 కోట్లు) దొంగిలించిన ఘటనలో తాను కూడా పాల్గొన్నట్లు అతను పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కోయిలాండి మున్సిపాలిటీలోని ఒక డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణన్, ఈ కేసులో ఏడాది తర్వాత లొంగిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బాలకృష్ణన్ వాంగ్మూలం ప్రకారం, షాజీ బొంబాయి అలియాస్ షాజహాన్ ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను అక్కడికి తీసుకెళ్లాడు. దోహా చేరుకున్న తర్వాత తనను ఒక లాడ్జిలో ఉంచి, కేఎంసీసీ కార్యాలయానికి తీసుకెళ్లి లాకర్‌ను పగలగొట్టాలని బెదిరించినట్లు అతను ఆరోపించాడు. లాకర్ తెరిచిన తర్వాత షాజీ నగదును తీసుకున్నాడని, అనంతరం తనకు తిరుగు ప్రయాణ టికెట్ ఇచ్చారని తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ఫిర్యాదు అందడంతో పోలీసులు దోపిడీ సహా ఇతర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బాలకృష్ణన్‌తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నారు. బాలకృష్ణన్‌ను కోర్టు రిమాండ్‌కు పంపగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులోని ఆరోపణలు, బాలకృష్ణన్ వాంగ్మూలంలోని అంశాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!