

అణు కార్యక్రమం విషయంలో అమెరికాకు ఇరాన్ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని కూడా ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఆ అణు పదార్థాలు తమ దేశ ప్రజల జాతీయ సంపద అని, వాటిని దేశ అవసరాల కోసమే వినియోగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి చర్చలు జరగాలంటే ముందుగా తమ షరతులను అంగీకరించాలని డిమాండ్ చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేసే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మంగళవారం టెహ్రాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయీ మాట్లాడుతూ, శుద్ధి చేసిన అణు పదార్థంలో ఒక్క గ్రామును కూడా దేశం వెలుపలకు పంపించబోమని స్పష్టం చేశారు.
మరోవైపు, అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా కఠిన వైఖరిని ప్రదర్శించారు. బెదిరింపుల మధ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని, అమెరికా ముందుగా తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సైనిక బెదిరింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ సైతం తమ దేశం నిర్దేశించిన ఏడు షరతులను అమెరికా నెరవేర్చాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, చమురు రంగంపై ఆంక్షల తొలగింపు వంటి అంశాలు ఈ డిమాండ్లలో కీలకంగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికాతో శాంతి చర్చలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!