

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన షరతులపై స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసెన్ రెజాయీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. అమెరికా తమకు నమ్మకం కలిగించే చర్యలు తీసుకునే వరకు చర్చలు ప్రారంభించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం ఇరాన్‌కు వెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కూడా ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం.
మరోవైపు, హర్మూజ్ జలసంధి విషయంలోనూ ఇరాన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమెరికా గౌరవించే వరకు కొత్త చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ విధించిన షరతుల అమలు, అమెరికా నుంచి విశ్వాసపూర్వక చర్యలు వంటి అంశాలు తదుపరి దౌత్య ప్రయత్నాలకు కీలకంగా మారనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!