

బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న విదేశీ ఖైదీల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం 15 దేశాలకు చెందిన కనీసం 407 మంది విదేశీయులు వివిధ నేరాలకు సంబంధించి అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం. వీరిలో 238 మంది భారతీయులు ఉన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్ వంటి కేసుల్లో వారు జైళ్లలో ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. భారతీయుల్లో 168 మంది శిక్షాకాలం పూర్తయినప్పటికీ, స్వదేశానికి పంపే ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. మిగిలిన విదేశీ ఖైదీల్లో మయన్మార్, నైజీరియా, పాకిస్థాన్, మలేషియా తదితర దేశాలకు చెందినవారు ఉన్నారు.
శిక్షాకాలం పూర్తిచేసుకున్న భారతీయ ఖైదీల జాబితాలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకు పంపినట్లు భారత హైకమిషన్ అధికారి వెల్లడించారు. అయితే, ఆయా ఖైదీలు భారతీయులేనని నిర్ధారించడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఖైదీలను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడేందుకు బంగ్లాదేశ్ అధికారుల అనుమతి కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఖైదీల జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!