

హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు వాహనదారులను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కోఠి–ఎంజే మార్కెట్ రహదారిపై పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పండ్ల రవాణా కోసం వచ్చే వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వ్యాపారులు, కొనుగోలుదారులు, వాహనాలతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు కూడా రహదారిని దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కోఠి నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ వైపు వెళ్లే మార్గంలోనూ రద్దీ కారణంగా ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణం సవాలుగా మారుతోంది.
మరోవైపు, మార్కెట్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు పారిశుద్ధ్య లోపాలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెబుతున్నారు. రహదారిపై వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మార్కెట్లో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను కోరుతున్నారు. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన ఎంజే మార్కెట్ పరిసరాల్లో రాకపోకలు సాఫీగా సాగేందుకు, పరిశుభ్రతను కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!